సీఎం రేవంత్‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది: ఎమ్మెల్సీ కవిత
ముఖ్యమంత్రి రేవంత్‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 5:27 PM IST
సీఎం రేవంత్‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడల్‌లో నడుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పీపీపీ అంటే.. ఫోబియా, పాలిటిక్స్, పర్సంటేజ్ అని అర్థం అని ఎద్దేవా చేశారు. ఫోబియా అంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని తెలిపారు. మైక్ పట్టగానే కేసీఆర్‌ను తిట్టడం మించి ఇంకో ఆలోచన రాదు అని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రైతు రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజాపాలన జరగడంలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రజా సమస్యలు, రైతుల కష్టాలు వదిలేసి.. సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారానికే నిజామాబాద్ వెళ్లారే తప్ప, రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయడంలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ సర్కార్‌ను 10 పర్సెంట్ సర్కార్ అని పిలుస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆచరణలో శూన్యం. మహిళలకు రూ.2500 ఇవ్వలేదు కానీ.. ఏకంగా పక్క రాష్ట్రంలో ఇచ్చేశాం అనే ప్రకటనలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. పీఆర్ స్టంట్ల మీద ఉన్న సోయి ప్రజలకు పని చేయడంలో లేదు.. అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలిపోతే సందర్శించి, బాధితులను పరామర్శించే సోయి లేని సీఎం రేవంత్.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మాత్రం వెళ్లారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేయడానికి సిద్ధమైందని కవిత ప్రశ్నించారు. రైతు రుణమాఫీ ఎవరికీ పూర్తిగా అందలేదు. రైతు భరోసా కూడా గ్రామాల్లో రైతులకు చాలా వరకు రాలేదు. రుణ మాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.. అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.