బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం ఉదయం ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు అసెంబ్లీ ప్రాంగణం దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. అనంతరం బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. కొంత కాలంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్.. బుధవారం (మార్చి 12) మాత్రం సెషన్ ప్రారంభానికి గంట ముందే అంటే ఉదయం 10 గంటలకే అసెంబ్లీకి రావడం గమనార్హం. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్.. చివరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీకి రాలేదు. మళ్లీ బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.