ఇండియా, ఎన్డీఏ కూటమిలకు మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు: కేటీఆర్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
By Srikanth Gundamalla Published on 14 May 2024 12:05 PM GMTఇండియా, ఎన్డీఏ కూటమిలకు మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు: కేటీఆర్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక కామెంట్స్ చేశారు. పార్లెమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో జాతీయ పార్టీల పని అయిపోతుందని అన్నారు. ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా, ఎన్డీఏ కూటములు రెండింటికీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదన్నారు.
ఇండియా, ఎన్డీఏ కూటముల్లో లేని పార్టీలే.. బీఆర్ఎస్, వైసీపీ, బీజూ జనతాదళ్ లాంటి ప్రాంతీయ శక్తులే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఐదు నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం టైమ్ చేసిందంటూ విమర్శలు చేశారు. ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్ సర్కార్‌కు కనీసం అవగాహన కూడా లేదంటూ మండిపడ్డారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే సత్తా కాంగ్రెస్ సర్కార్‌కు లేదని కేటీఆర్ అన్నారు.
ఇక తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అద్భుతంగా ఫైట్ చేశారని కేటీఆర్ కొనియాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయని అన్నారు. ఎక్కువ సీట్లు మనమే సాధించబోతున్నామని దీమాగా చెప్పారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని ప్రజలకు అర్థం అయ్యిందని చెప్పారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో ఏమీ కాదని ప్రజలకు తెలుసని అన్నారు. ఈ ఎన్నికల్లో చేసిన కృషి స్థానిక సంస్థల ఎన్నికలకు పునాది కాబోతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్‌కు రాష్ట్రంలో మున్ముందు గడ్డు పరిస్థితులే ఎదురవుతాయని చెప్పారు. ఐదు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనీ.. అడ్డగోలుగా హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతున్నారనే కోపంతో ఉన్నారని చెప్పారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.