తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కుంభకోణానికి పాల్పడితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫైళ్లను దాచిపెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని.. బీఆర్ఎస్ సర్కారు పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. అది తప్ప ఏ మార్పూ రాలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ సర్కారు ఇప్పుడేం చేస్తోందని మోదీ ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇంత వరకూ ఆ పనిచేయలేదని మోదీ విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందలకు పైగా సీట్లు సాధిస్తుందని.. దేశమంతా మోదీ గ్యారెంటీలపైనే చర్చ జరుగుతోందని అన్నారు.
"2014 తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి, గిరిజనుల గౌరవానికి పెద్దపీట వేసింది.. ఒక గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా ఊహించారా? భగవాన్ బిర్సా ముండా జయంతిని జాతీయ పండుగలా జరుపుకుంటారని ఊహించారా? గిరిజనుల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది." అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.