రాహుల్ గాంధీ ఖమ్మం సభకు బీఆర్‌ఎస్ అడ్డంకులు సృష్టిస్తోంది: కాంగ్రెస్
ఖమ్మం జిల్లాలో ఈ రోజు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభకు వచ్చే వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
By అంజి Published on 2 July 2023 2:06 PM ISTరాహుల్ గాంధీ ఖమ్మం సభకు బీఆర్‌ఎస్ అడ్డంకులు సృష్టిస్తోంది: కాంగ్రెస్
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ 'తెలంగాణ జన గర్జన' బహిరంగ సభకు ఖమ్మం ఆదివారం ముస్తాబవుతుండగా, పార్టీ కార్యకర్తలు, ప్రజలు సభకు హాజరవ్వకుండా ఉండేందుకు అధికార బీఆర్‌ఎస్ అవరోధాలు సృష్టిస్తోందని ఆ పార్టీ ఆరోపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. దీంతో సభకు వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధుయాష్కీ డీజీపీ ఫిర్యాదు చేశారు. ఖమ్మం సభకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్.. వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని డీజీపీని కోరారు. సాయంత్రం జరగనున్న సభకు జనాలు రాకుండా అధికారుల సాయంతో ప్రభుత్వ పెద్దలు వేధింపులకు గురిచేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. కార్యకర్తలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ప్రజలను అధికారులు అడ్డుకుంటున్నారని కంటతడి పెట్టారు. ఉమ్మడి జిల్లా సరిహద్దులలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు శనివారం అర్ధరాత్రి నుంచే వాహనాలను సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జనాలను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతోందని పొంగులేటి మండిపడ్డారు.
ప్రజలను సభకు తరలించడానికి 1,500 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) బస్సులను అద్దెకు ఇవ్వడానికి రూ.2 కోట్లు చెల్లించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఖమ్మంకు ప్రభుత్వం బస్సులు సదుపాయం కల్పించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాహుల్ గాంధీ సభకు హాజరైతే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సామాజిక సంక్షేమ పథకాలను కట్ చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు ఖమ్మం ప్రజలను బెదిరిస్తున్నారని అన్నారు. ప్రైవేట్ వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేస్తున్నారు అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో.. కాంగ్రెస్ ఆదివారం రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగే ఈ భారీ బహిరంగ సభతో తెలంగాణలో ఎన్నికల శంఖారావం మోగించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కను రాహుల్ సత్కరించడంతోపాటు మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కూడా అధికారికంగా పార్టీలో చేర్చుకుంటారు. రాహుల్‌గాంధీ ప్రజా పోరాట యాత్ర పార్టీకి కావాల్సిన శక్తిని ఇస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం ఏరియాలో 10 సీట్లు గెలిస్తే రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తామని, ప్రస్తుత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోడు భూముల పంపిణీలో కుంభకోణాన్ని ఆరోపిస్తూ అధికార వ్యతిరేకతను చాటుకుంటామని ఆ పార్టీ పేర్కొంది. అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.