రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీఎస్పీ- బీఆర్ఎస్ కూటమిలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ తన అభ్యర్థులను నాగర్ కర్నూల్ (SC), హైదరాబాద్ నియోజకవర్గాల్లో బరిలో దించబోతున్నదని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మిగతా నియోజకవర్గాల్లో బీఆరెస్ పోటీ చేయబోతున్నదని, రెండు పార్టీలు అన్ని చోట్ల పరస్పర సహకారంతో విజయం దిశగా పయనించబోతున్నాయని అన్నారు.
ఈ చారిత్రాత్మక ఒప్పందానికి అనుమతించిన బీఎస్పీ అధినేత్రి మాయావతికి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి, దేశంలో బహుజనుల రక్షణకోసం ఈ పొత్తు ఒక చారిత్రాత్మక అవసరం అని అన్నారు. తెలంగాణలో ఈ లౌకిక కూటమి నిస్సందేహంగా విజయ దుందుభి మోగించబోతున్నదన్నారు.
ఇక ఇదే విషయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ కూడా ట్విటర్ వేదికగా ప్రకటించింది. వపార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తులో భాగంగా ఇరుపార్టీలు జరిపిన చర్చల అనంతరం.. రెండు సీట్లను బీఎస్పీకి కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారని తెలిపింది. అందులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారని పేర్కొంది.