ఏడవ రోజు అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభంలోనే ప్రతిపక్ష పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో సర్కార్ వైఫల్యంపై సభలో చర్చకు పట్టుబడుతూ బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని అందజేసింది.
ఎన్నికల సందర్భంగా మహిళలకు రూ.2,500 ఆర్ధిక సాయం, కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, ఆ అంశాలపై అసెంబ్లీలో చర్చకు బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
ప్రభుత్వ శాఖల్లో వివిధ కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రైవేటు ఏజెన్సీలతో కాకుండా కార్పోరేషన్ ద్వారా శాలరీలు అందజేయాలని కోరుతూ సీపీఐ వాయిదా తీర్మానం నోటీసును స్పీకర్‌కు అందజేసింది.
ఇదిలావుంటే.. నిన్నటితో అసెంబ్లీ సమావేశాలు ముగియాల్సి ఉండగా.. భూ భారతి బిల్లుపై చాలా సమయం చర్చ జరిగింది. దీంతో సమావేశాలను ఒక్క రోజు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు పలు అంశాలపై చర్చ జరుగనుంది.