విజయ సంకల్ప సభ : మోదీ ప్రసంగం హైలెట్స్
BJP Vijayasankalpa Sabha Highlights. బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన
By Medi Samrat Published on 3 July 2022 9:38 PM ISTబీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సభలో ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీని ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అంటు ప్రసంగం ప్రారంబించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారును అధికారంలోకి తీసుకు రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కారుపై విమర్శల జోలికి వెళ్లని మోదీ.. గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందనే విషయాలను వెల్లడించడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా ప్రసంగం సాగింది.
తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఈ సభకు వచ్చారనిపిస్తోందన్న ఆయన.. ఈ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌కు ప్రతిభకు పట్టం కడుతుందని అన్న ఆయన.. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ కళాత్మకతను, వీరత్వాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. గత రెండు రోజులుగా పార్టీ ప్రతినిధులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మీ ప్రేమను పొందారన్నారు. హైదరాబాద్ నగరం అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తోందన్నారు.
దేశ పురోగతి కోసం బీజేపీ ప్రభుత్వం రేయింబవళ్లు పని చేస్తున్నాయన్న ప్రధాని మోదీ.. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సభకు ఎంతో విశిష్టత ఉందన్నారు. తెలంగాణ ప్రజలు దేశ పురోగతి కోసం శ్రమిస్తున్నారని మోదీ కొనియాడన్నారు. తెలంగాణ ప్రాచీన పరాక్రమాల గడ్డ అని ప్రశంసించారు. భద్రాచలంలో శ్రీరాముడు, యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి జోగులాంబ అమ్మవారు, వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి. కాకతీయులు వీరత్వం, శిల్పకళా సౌందర్యం ఎంతో గొప్పది. ఇక్కడి సాహిత్యకారుల కృషి దేశానికే గర్వకారణం. తెలంగాణలో కలలు, నైపుణ్యం ఎంతో మెండుగా ఉన్నాయన్నారు.
బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోందని అన్నారు. సబ్ కా సాథ్, సబ్‌కా వికాస్ కోసం పనిచేస్తున్నామన్నారు. కరోనా కాలంలో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించామని తెలిపారు. బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం మరింత పెరిగిందని అన్నారు. గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశామని అన్నారు. దశాబ్దాల నుంచి వంచనకు గురైన వాళ్ల అభివృద్ధి కోసం పనిచేశామని తెలిపారు.
తెలంగాణలో 5 సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని మోదీ తెలిపారు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం కేంద్రం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.3 వేల కోట్లు వెచ్చిస్తున్నామని మోదీ తెలిపారు. తెలంగాణలో 5 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను ఏర్పాటు చేశామన్నారు. పీఎం గ్రామీణ్ సడక్ యోజనలో భాగంగా.. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో రూ.1700 కోట్లు ఖర్చు చేశామన్నారు.