డీఎంకే ముసుగులో తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల చేత తిరస్కారానికి గురవుతున్న డీఎంకే, దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోంది. తమిళనాడులో ప్రజలు డీఎంకేపై తిరగబడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓట్లతో, 8 ఎంపీలను మేం గెలిచాం...అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీలు పడి డీఎంకే నిర్వహించే అఖిలపక్ష సమావేశాలకు హాజరవుతామని అంటున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల మీద ఎందుకు అఖిలపక్షం నిర్వహించరు? డీ లిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా సాగే ప్రక్రియ, రాజకీయాలు అంటగట్టడం తగదు. విభజించు పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతం ఫాలో అవుతున్నారు. ఉత్తర భారతదేశం, దక్షిణ దేశం అని కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది. ప్రో రేటా ప్రకారం డీ లిమిటేషన్‌లో సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు పెద్ద సంఖ్యలో చట్ట సభలకు వస్తారని, అందుకే కాంగ్రెస్ అడ్డుకునే కుట్రలు చేస్తుంది..అని లక్ష్మణ్ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లు, జనాభా లెక్కలను అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయి. బీజేపీని రాజకీయంగా కాంగ్రెస్ ఎదుర్కోలేక, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంది..అని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు.