చేతకాకపోతే రాజీనామా చెయ్..రేవంత్‌పై ఈటల ఆగ్రహం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
By Knakam Karthik
చేతకాకపోతే రాజీనామా చెయ్..రేవంత్‌పై ఈటల ఆగ్రహం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా సీఎం మాట్లాడారని ఈటల విమర్శంచారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రమని సీఎం రేవంత్ రెడ్డి అనడం సరికాదని అన్నారు. రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని, లేదా నైతిక బాధ్యత వహించి ఉద్యోగుల డిఎ ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని తెలియజేశారు. 2014 లోనే తెలంగాణ సొంత పన్నుల ఆదాయం రూ.29 వేల కోట్లు అని తెలిపారు. ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాలా రాష్ట్రంగా చూపొద్దు అని, ఇప్పటివరకు రేవంత్ సర్కార్ చేసిన అప్పు రూ. లక్షా 30 వేల కోట్లు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
దివాళా తీసింది తెలంగాణ కాదు.. కాంగ్రెస్ దివాళ తీసింది. రేవంత్ రెడ్డి తాను సీఎం అని మర్చిపోయి మాట్లాడుతున్నారు. నెలకు దాదాపు రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుంటే.. దివాళా తీసిందని ఎలా అంటారు?. తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదు. ఇప్పటికీ దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్ర. మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదనే కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారు. హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శనిలా దాపురించిందని..ఎంపీ ఈటల విమర్శించారు.
కాగా, ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు సిద్ధమవుతున్న క్రమంలో రేవంత్ రెడ్డి మాట్టాడుతూ.. తెలంగాణ దివాళా తీసిందని.. బయట ఒక్క రూపాయి అప్పు పుట్టడం లేదన్నారు. తెలంగాణ ప్రతినిధులను దొంగలు చూసినట్లు చూస్తున్నారని.. తనను కోసినా ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాదన్నారు. వచ్చే ఆధాయం మొత్తం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు, పించన్లకే సరిపోతుందని తేల్చి చెప్పారు. అయితే, సిఎం మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.