కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బండి సంజయ్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారని చెప్పారు. ఆయన అధ్యక్షుడిగా పార్టీలో మంచి విజయాలు సాధించామని అన్నారు. బండి సంజయ్ అగ్రెసివ్ గా అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని ఆయన నాయకత్వంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ నియామకంపై అర్వింద్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ హైకమాండ్ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ న్ రెడ్డిని, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ ను నియమించింది.
బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. ఏపీ బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు తీసుకోనున్నారు. తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటెల రాజేందర్‌ను నియమించింది బీజేపీ అధిష్టానం. 2020 జులై 27న ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు పదవీ కాలం ముగియడంతో పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కించుకున్నారు.