మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు, లొంగిపోవాల్సిందే: బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు

By Knakam Karthik
Published on : 4 May 2025 3:18 PM IST

Telangana, Bandi Sanjay, Maoists, Operation Kagaar, Security Forces

మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు, లొంగిపోవాల్సిందే: బండి సంజయ్

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ జరుగుతున్న వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తుపాకులతో అమాయకులను చంపిన వారితో చర్చలు ఉండవు అని అన్నారు. మావోయిస్టులు మందుపాతరలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో గిరిజనులను కాల్చి చంపారు. తుపాకీ వీడనంత వరకు చర్చల ఊసే ఉండదు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఒక్కటే.. మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నారు. మావోయిస్టులతో మాటల్లేవ్, మాట్లాడుకోడాల్లేవ్..అని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.

కాగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలపై భారీ ఆపరేషన్ చేపట్టింది. వెయ్యి మందికి పైగా మావోయిస్టులు కర్రెగుట్టల్లో తలదాచుకున్నారనే నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర భద్రతా బలగాలు అడవిని జల్లెడ పట్టాయి. దాదాపు 9 రోజుల పాటు కర్రెగుట్టలపై హెలికాప్టర్లు, డ్రోన్లతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. కర్రెగుట్టలపై ఉన్న ఓ సొరంగంలో మావోయిస్టులు ఆశ్రయం పొందినట్లు గుర్తించాయి.

ఈ ఆపరేషన్ కగార్‌పై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలుపుతూ.. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలనే ప్రతిపాదనను తీసుకొచ్చింది. అంతకుముందు శాంతి చర్చల కమిటీ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. కాల్పుల విరణ, మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రాష్ట్ర కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తెలియజేస్తామని శాంతి చర్చల కమిటీ నేతలకు తెలిపారు.

Next Story