లేఖలు రాసి దులుపుకోవడం కాదు, బుల్లెట్ దిగిందా? లేదా?: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik
లేఖలు రాసి దులుపుకోవడం కాదు, బుల్లెట్ దిగిందా? లేదా?: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంజయ్‌తో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బండి సంజయ్ మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ సహా కొంతమంది నాయకులు ప్రతిదానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నరు. ఇప్పుడు ఇంత అభివ్రుద్ది జరుగుతుంటే ఇదంతా మావల్లే జరిగిందని వాళ్లు ప్రచారం చేసుకుంటున్నరు. మాటలు కాదు... బుల్లెట్ దిగిందా? లేదా? చూడాలి’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎవరి హయాంలో రైల్వే స్టేషన్లు అభివ్రుద్ధి చెందాయో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణే నిదర్శనమన్నారు.
అతి త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను సైతం అమ్రుత్ భారత్ పథకంలో చేర్చి ఆధునీకరిస్తామన్నారు. కరీంనగన్ నుండి హసన్ పర్తి వరకు 61 కి.మీల నూతన రైల్వే లేన్ నిర్మాణంపై సర్వే పూర్తి చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారు చేశామన్నారు. ఈ నూతన లేన్ నిర్మాణానికి రూ.1480 కోట్ల వ్యయం అవుతుందని డీపీఆర్ లో పేర్కొన్నారని, దీనిపై అతి త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కరీంనగర్ నుండి తిరుపతికి ప్రతిరోజు రైలు నడపాలని తనతోపాటు పొన్నం ప్రభాకర్ సైతం లేఖలు రాశారని, అయితే రద్దీ, సాంకేతిక కారణాల రీత్యా అది సాధ్యపడలేదన్నారు. వారానికి రెండుసార్లు నడుస్తున్న ఈ రైలును వారానికి 4సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.