తెలంగాణ మంత్రులు కేవలం దిష్టిబొమ్మలు మాత్రమే : మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
BJP Leader EX MP Boora Narsaiah Goud. హత్యలు, అత్యాచారాల్లో తెలంగాణ బీహార్ ని మించి పోయిందని భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు
By Medi Samrat Published on 1 March 2023 5:59 PM ISTBJP Leader EX MP Boora Narsaiah Goud
హత్యలు, అత్యాచారాల్లో తెలంగాణ బీహార్ ని మించి పోయిందని భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైద్య విద్యార్ధిని ప్రీతిది హత్యా నా ? ఆత్మహత్య నా ? అని కూడా ప్రభుత్వం తేల్చలేకపోయిందన్నారు. ప్రీతి కేసులో పొలిటికల్ మేనేజ్మెంట్ చేశారు.. ప్రీతి 5 రోజుల పాటు పొలిటికల్ వెంటిలేటర్ పై ఉందని ఆరోపించారు. పోలీసుల్లో మానవత్వం లోపించిందని అన్నారు.. ఓ విద్యార్థి తండ్రి వేడుకుంటున్నా పోలీసులు కాలుతో తన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రీతి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వేటకొడవళ్లతో రోడ్లపై హత్యలు జరుగుతున్నాయి.. పోలీసు వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మద్యం, మత్తు, మతం ఈ మూడింటితో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి.. నేరాలు- ఘోరాలకు ప్రభుత్వ పాలసీలే కారణం అని అన్నారు. తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మంచి మనిషి.. కానీ కానిస్టేబుల్ కు ఉన్న విలువ కూడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులు కేవలం దిష్టిబొమ్మలు మాత్రమేనని నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనివ్వాలని డిమాండ్ చేశారు.
కుక్క కాటుకు బలైన బాలుడి కుటుంబాన్ని ఒక్క మంత్రి కూడా పరామర్శించలేదు. మనిషికి, మాంసం ముద్దకు కూడా మేయర్ కు తేడా తెలియదని మండిపడ్డారు. బీఆర్ఎస్ మీటింగ్స్ లో నేతలవి కారు కూతలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. బిజేపీ చేపట్టిన 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రజలు ఓట్లేస్తేనే హీరోలు అవుతారు.. పెద్ద నాయకుల కోసం ప్రజలు చూడటం లేదు. పేదల్లోనే నాయకులను బిజేపీ తయారు చేస్తుందని అన్నారు. బిజేపీ వామన అవతారంలాంటింది.. చాపకింద నీరులా బిజేపీ విస్తరిస్తోందని పేర్కొన్నారు.