కేసీఆర్ పాలనకు బీజేపీ మాత్రమే ముగింపు పలకగలదు

BJP leader Dasoju Sravan Fire On CM KCR. హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, ఆయన అనుచరుల

By Medi Samrat  Published on  10 Aug 2022 1:58 PM GMT
కేసీఆర్ పాలనకు బీజేపీ మాత్రమే ముగింపు పలకగలదు

తెలంగాణలో కేసీఆర్‌ అప్రజాస్వామిక, అవినీతి పాలనకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమే ముగింపు పలకగలదని, రాబోయే మునుగోడు ఉప ఎన్నికలు నిస్సందేహంగా రుజువు చేస్తాయని బీజేపీ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రకటించారు. న్యూఢిల్లీలో బీజేపీలో చేరిన డాక్టర్ దాసోజు శ్రవణ్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, ఆయన అనుచరుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు వనరులు, అభివృద్ధిలో సమాన భాగస్వామ్యం కల్పించే సామాజిక న్యాయం (సామాజిక తెలంగాణ) సాధనకై కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

కేసీఆర్ నిరంకుశ, అవినీతి పాలనను ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమే అంతం చేయగలదని తెలంగాణ ప్రజలు దృఢంగా విశ్వసిస్తున్నారని అన్నారు. బీజేపీని విలువలు, సంస్కారం ఉన్న పార్టీగా చూస్తున్నారని పేర్కొన్నారు. తనను కాషాయ పార్టీలోకి హృదయపూర్వకంగా స్వాగతించినందుకు బీజేపీ జాతీయ, తెలంగాణ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ తన కుటిల వ్యూహాలతో రెండు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. రకరకాల రాజకీయ జిమ్మిక్కుల ద్వారా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మూడోసారి ప్రయత్నిస్తున్నారు. 1500 మందికి పైగా అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రజలు కేసీఆర్ వ్యూహాల పట్ల అప్రమత్తంగా ఉండి తెలివైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. సుపరిపాలన, సామాజిక న్యాయం కోసం తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలి'' అని డాక్టర్ దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి చేశారు.

గత ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదన్నారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టింది. దీంతో సకాలంలో పింఛన్లు అందడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. లోటును భర్తీ చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన పన్నులు, వసూళ్లు చేస్తోంది.

సామాన్యులపై భారం తగ్గించేందుకు డీజిల్, పెట్రోల్ ధరలను కేంద్రం తగ్గించగా.. ఆ లబ్ధిని తెలంగాణ ప్రజలకు బదలాయించకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోంది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణను 'బార్ అండ్ చీర్' ఆర్థిక వ్యవస్థగా మార్చారు. కేసీఆర్ తన అపరిపక్వత, అసమర్థతతో తెలంగాణను పూర్తిగా నాశనం చేశారు'' అని డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.


Next Story
Share it