ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపుకు బీజేపీ సహాయం: కాంగ్రెస్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితిని గెలిపించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాకరే అన్నారు.

By అంజి  Published on  8 Nov 2023 9:33 AM IST
BJP, BRS, elections, Telangana polls, Congress

ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపుకు బీజేపీ సహాయం: కాంగ్రెస్‌ 

హైదరాబాద్: వివాదాస్పద కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితిని గెలిపించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుండి మద్దతు పొందాలని చూస్తోందని కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాకరే మంగళవారం ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్, ఏఐఎంఐఎం ఒక్కటేనని అన్నారు. ఈ పార్టీలు కలిసి పోరాడుతున్నారని తాము ఎప్పటినుంచో చెబుతున్నాం అని అన్నారు.

నిన్న జరిగిన బీజేపీ సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ ఏమీ మాట్లాడలేదని, ఇక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ఎన్నికల్లో పోరాడుతున్నాయని స్పష్టం చేశారు. ''ఇక్కడ బీఆర్‌ఎస్‌ యొక్క ప్రతి నిర్ణయాన్ని బీజేపీ తీసుకుంటోంది. బీఆర్‌ఎస్‌కు (ఎన్నికల్లో గెలవడానికి) సహాయం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది, తద్వారా 2024లో వారికి (బీఆర్‌ఎస్ నుంచి) సహాయం అందుతుంది'' అని మాణిక్‌రావ్ ఠాకరే అన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి, బుజ్జగింపులకు పాల్పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించిన కొన్ని గంటల తర్వాత కాంగ్రెస్ నేత ఈ విధంగా స్పందించారు. ''కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ యొక్క 'C' టీమ్. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల డీఎన్‌ఏలో రాజవంశం, అవినీతి, బుజ్జగింపు అనే మూడు అంశాలు ఉమ్మడిగా ఉన్నాయి'' అని ప్రధాని మోదీ హైదరాబాద్‌లో అన్నారు.

అవినీతి కేసులపై విపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని.. “ప్రజాధనాన్ని లూటీ చేసిన వాళ్లు అన్నింటినీ తిరిగి ప్రజలకు అందించాల్సి ఉంటుంది. యే మోడీ కి గ్యారెంటీ హై (ఇది మోడీ హామీ). బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ఒకే నాణేనికి రెండు ముఖాలు. వారి ఉద్దేశాలు రాష్ట్ర వనరులను దోపిడీ చేయడంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇద్దరూ తమ కొడుకులు, కూతుళ్లను ప్రమోట్ చేస్తున్నారు. వారు మీ కొడుకులు, కుమార్తెల గురించి పట్టించుకోరు" అని అన్నారు.

తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మరో నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.

Next Story