హైదరాబాద్: దేశంలో ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరిగినందు వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగలిగింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ చేపట్టిన ఓట్ చోర్ సంతకాల సేకరణ విషయంలో టీపీసీసీ జూమ్ మీటింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంఘంగా పని చేస్తుంది. రాహుల్ గాంధీ ఓట్ చోరీ విషయంలో అన్ని రకాల ఆధారాలతో ఓట్ చోరీలను బయటపెట్టారు. అంత పకడ్బందీగా ఆధారాలు చూపించినా కూడా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేదు..అని వ్యాఖ్యానించారు.
మన దగ్గర సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడంలో కొంచం ఆలస్యం జరిగింది. ఇక్కడ భారీ వర్షాలు ఉండడం తో సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలి. గ్రామానికి కనీసం వంద మందితో చేయించాలి. ప్రతీ గ్రామంలో ఓట్ చోరీ ఎలా జరిగింది బీజేపీ ఎలా ఓట్ చోరీ చేసిందో ప్రజలకు వివరించాలి. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రతి గ్రామంలో ఈ సంతకాల సేకరణ జరిగే విదంగా చూడాలి..అని టీపీసీసీ చీఫ్ దిశానిర్దేశం చేశారు.