తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైర్టులో భారీ ఊరట లభించింది. 2020 మార్చిలో ఆయనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెందిన జన్వాడ ఫామ్ హౌజ్‌పై పర్మిషన్ లేకుండా డ్రోన్ ఎగురవేశారంటూ నార్సింగ్ పోలీసులు రేవంత్ మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కాగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో అప్పట్లో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి 18 రోజులు జైలుకు తరలించారు. అయితే తనపై తప్పుడు కేసు పెట్టారని ఈ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని 2020 మార్చిలోనే రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమి కాదని రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది వాదన వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు నార్సింగి పీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.