అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన చెట్టిపెల్లి అర్జిత్ రెడ్డి (14) మృతి పట్ల జనగామ జిల్లాలోని లింగాల ఘణపూర్ మండలం బండ్లగూడెం గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. బండ్లగూడెం గ్రామానికి చెందిన చెట్టిపెల్లి రాంచంద్రారెడ్డి అనే టెక్కీ, తన భార్య రజిత, వారి పిల్లలు అర్జిత్ (14), అక్షిత (16)లతో కలిసి గత 20 ఏళ్లుగా అమెరికాలో నివాసముంటూ శాశ్వత నివాసం కార్డులు (పీఆర్) కలిగి ఉన్నారు. రాంచంద్రారెడ్డి తన భార్య, పిల్లలతో కలిసి కారులో ఇంటికి తిరిగి వస్తుండగా వెనుక నుంచి మరో వాహనం ఢీకొనడంతో అర్జిత్ మృతి చెందినట్లు బండ్లగూడెంకు చెందిన అతని అన్న రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో అక్షితకు తీవ్ర గాయలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాంచంద్రారెడ్డి, రజితలకు కూడా గాయాలయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
"వారు ఇంటికి కేవలం 10 నిమిషాల దూరంలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. సోదరితో పాటు వెనుక కూర్చొని ఉండడంతో మా అన్న కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. ఆదివారం సాయంత్రం మాకు సమాచారం అందింది, "అని అతను చెప్పాడు. రాజి రెడ్డి కుమారుడు రాంచంద్రారెడ్డి చాలా కాలం క్రితం యుఎస్‌లో స్థిరపడ్డాడు. బండ్లగూడెం గ్రామంలో దాదాపు 10 ఎకరాల భూమి ఉన్న ఆయనకు రెండు మూడేళ్లకు ఒకసారి గ్రామానికి వస్తుంటారు. చెట్టిపెల్లి కుటుంబాన్ని ఆ ఊరి జమీందారుగా పిలుస్తుంటారు కాబట్టి గ్రామస్తుల్లో వీరికి మంచి ఫాలోయింగ్ ఉందని స్థానికులు చెబుతున్నారు. అర్జిత్‌రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.