రాష్ట్రంలో ఆడబిడ్డలు చనిపోతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు..?
Bandi Sanjay Sensational Comments. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఒక రోజు దీక్ష చేశారు బండి సంజయ్
By Medi Samrat Published on 6 March 2023 5:49 PM ISTBandi Sanjay
చనిపోయిన ప్రీతికి నాలుగు రోజులపాటు హైదరాబాద్ నిమ్స్ లో ట్రీట్ మెంట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఒక రోజు దీక్ష చేశారు బండి సంజయ్. ప్రీతి కేసులో కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, నిందితులను కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసును పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు. ప్రీతి ఎందుకు చనిపోయింది.. ఎలా చనిపోయింది అనే విషయంపై ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదని.. ఎందుకు నిజాన్ని దాచి పెడుతుందని ప్రశ్నించారు బండి సంజయ్. తెలంగాణ ఆడబిడ్డల కోసం, వారి భద్రత కోసం, వారికి అండగా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. శవాలను ఎత్తుకెళ్లి రాజకీయం చేసే దుర్మార్గమైన.. నీచమైన స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం దిగజారిందని.. రాష్ట్రంలో అడబిడ్డలు చనిపోతుంటే సీఎం కేసీఆర్ కనీసం పరామర్శించటం లేదని అన్నారు. ప్రగతిభవన్ నుంచి బయటకు రావటం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రీతి శరీరంలో ఎలాంటి విష పధార్థాలు లేవని టాక్సికాలజీ రిపోర్ట్ లో వెల్లడయ్యింది. గుండె, కాలేయం, రక్తం, ఊపిరితిత్తులు వంటి పలు అవయవాల్లో విష పధార్థాలు లేవని.. దీంతో ప్రీతి ఆత్మహత్య కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చేందుకు పోలీసులు భావిస్తున్నారు. టాక్సికాలజీ రిపోర్ట్ పై ప్రీతి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి కడుపును డయాలసిస్ చేసి బ్లడ్ శాంపిల్ తీసుకున్నారని, అలాంటప్పుడు రిపోర్ట్ ఎలా కరెక్ట్ వస్తుందని ప్రీతి సోదరుడు ప్రశ్నించాడు. ప్రీతి కేసును కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారని, ప్రీతిది ముమ్మాటికి హత్యేనని ఆరోపిస్తున్నారు.