ఆ పార్టీ విషసర్పాల కంటే డేంజర్: బండి సంజయ్
మజ్లిస్ పార్టీ విష సర్పాల కంటే డేంజర్ పార్టీ అని బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik
ఆ పార్టీ విషసర్పాల కంటే డేంజర్: బండి సంజయ్
అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు చేస్తారా? అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులంతా అల్లాడుతుంటే వాళ్లను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న దారుస్సాలంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిర్వహించిన బహిరంగ సభపై కౌంటర్ ఇచ్చారు. నిన్న మజ్లిస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ కార్యక్రమమని, ఈ మీటింగ్ కు కర్త, కర్మ, క్రియగా అంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని ఆరోపించారు. ఈ మీటింగ్ కు ఆర్ధిక సాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.
ముస్లింల పట్ల ప్రేమ నటిస్తూ వక్ఫ్ ఆస్తులను దోచుకుతింటూ ముస్లింలను మురికి కూపాల్లోకి నెట్టేసిన మజ్లిస్ నేతలు అంతకంటే డేంజర్ అని ధ్వజమెత్తారు. వక్ఫ్ బిల్లు వ్యతిరేక పేరుతో బహిరంగ సభలతో రాజకీయాలా? వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్ అది. మందిరాలు, గురు ద్వారా, వ్యవసాయ భూములను ఆక్రమించుకున్న దోపిడీదార్లు. మజ్లిస్ పార్టీ విష సర్పాల కంటే డేంజర్ పార్టీ. ముస్లిం ఓట్లు దండుకుని ఆ ముస్లింలకు ద్రోహం చేస్తున్న పార్టీ ఎంఐఎం..అని బండి సంజయ్ ఆరోపించారు.