చంపినోడే సంతాపసభ పెట్టినట్లుంది : బండి సంజయ్
ఈ దేశంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంబేద్కర్ మాత్రమే..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
By Knakam Karthik
చంపినోడే సంతాపసభ పెట్టినట్లుంది, అవమానించింది వాళ్లే: బండి సంజయ్
ఈ దేశంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంబేద్కర్ మాత్రమే..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లతో కలిసి బండి సంజయ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. చంపినోడే సంతాప సభ పెట్టినట్లుగా కాంగ్రెస్ తీరు ఉంది. అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్ అని, ఆయనపై కుట్ర చేసి రెండు సార్లు ఓడించిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఆయనకు భారతరత్న ఇవ్వకుండా అవమానించడమే కాకుండా ఆయననను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ప్రదానం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఫైర్ అయ్యారు. అలాంటి పార్టీ ఇవాళ అంబేద్కర్ జయంతిని పండుగలా నిర్వహించాలనడం సిగ్గుచేటని, తక్షణమే బడుగు, బలహీనవర్గాల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
అంబేద్కర్ భిక్షవల్లే ప్రధాని కాగలిగానని మోడీ అన్నారంటే వారి గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు బీజేపీ కృషి చేస్తున్న ప్రభుత్వం నరేంద్రమోడీదే.. భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచ తీర్థాలను ఏర్పాటు చేసిందన్నారు. బీజేపీ కృషితోనే అంబేద్కర్‌కు భారతరత్న అవార్డుతో గౌరవమిచ్చిందన్నారు. అంబేద్కర్ జీవితమే మాకు స్ఫూర్తి.. అంబేద్కర్ స్మారక స్టాంపులు, బిల్లుల విడుదల. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటం, సుప్రీంకోర్టు, న్యాయ మంత్రిత్వ శాఖలో విగ్రహాల ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో శక్తివంతమైన సమాజం కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని మోడీ ప్రభుత్వానికి అండగా నిలవాలని..బండి సంజయ్ కోరారు.