బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం నేనే కట్టానంటూ.. నదులకు నడక నేర్పింది నేనే అంటూ ప్రచారం చేసుకున్న సీఎం కేసీఆర్.. పొట్టు పొట్టు కమిషన్లు తీసుకోవడం వల్లే ఈ రోజున మేడిగడ్డ రిజర్వాయర్ కు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో వంతెనలకు, బ్రిడ్జిలకే కాదు.. ప్రజల జీవితాలకు కూడా గ్యారెంటీ లేదన్నారు.
కేసీఆర్ విదేశాలకు పారిపోవాలనే ఆలోచనతో ఉన్నారని.. బీజేపీ ముందు ఆయన ఆటలు సాగవన్నారు. కేసీఆర్ అధికార మదం వల్ల ఆయన కొడుకు, మంత్రి కేటీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని.. ఇది ఏ మాత్రం మంచిది కాదని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్ వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తూ ఉన్నారని ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.