తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. డిసెంబర్ 9 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే మహిళలు, ఆర్టీసీ బస్సులలో వెళుతూ ఉన్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చాక రోజూ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య డబుల్ అయింది. ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ లేదు. ఆటోలు ఎక్కే వారు కరువయ్యారు. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 16న ఆటోల బంద్ కు సిద్ధమయ్యారు. ఆ రోజు ఒక్క ఆటో కూడా రోడ్డెక్కకూడదని డ్రైవర్ల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఆటో డ్రైవర్లు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.