బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ను వచ్చే నెల 5వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని హైదరాబాద్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారంటూ హరీష్‌రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో చక్రధర్ అనే వ్యాపారి కంప్లయింట్ చేశాడు. చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. వచ్చే నెల 5వ తేదీన వాదనలు వినిపిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలపడంతో విచారణను వాయిదా వేసింది.
ఇదే కేసులో అరెస్టయిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. రాజకీయ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులు సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేశారంటై నమోదైన కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయిన తిరుపతన్న 10 నెలలుగా జైల్లోనే ఉన్నాడు. మొదట బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును తిరుపతన్న పలుమార్లు ఆశ్రయించగా నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చినప్పటికీ, ఎట్టకేలకు అత్యున్నత న్యాయస్థాన తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు.