అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ విడుదల
Amit Shah's Telangana tour schedule released. తెలుగు రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది.
By Medi Samrat
తెలుగు రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పలువురు బీజేపీ నాయకులు వరుసగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ 9 సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు మహాజన్ సంపర్క్ యాత్రలను బీజేపీ చేపట్టింది. తెలంగాణలో ఈ నెలలో నిర్వహించే సభల్లో కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. జూన్ 15న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను బీజేపీ విడుదల చేసింది.
జూన్ 15వ తేదీన భద్రాచలంలో రాములవారి దర్శనంతో అమిత్ షా పర్యటన మొదలుకానుంది. దీని కోసం ముందుగా ఈనెల 15న ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి షా చేరుకుంటారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు అల్పాహారం చేస్తారు.. ఈ సమయంలో ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి భద్రాచలానికి బయల్దేరి వేళతారు. భద్రాచలంకు చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.20 మధ్యలో శ్రీరాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను కేంద్రమంత్రి అమిత్ షా చేస్తారు. తర్వాత ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు తిరిగి శంషాబాద్‌కు వచ్చి రాత్రి 7 గంటలకు పలువురు నేతలతో వేరు వేరుగా కలుస్తారు. తిరిగి రాత్రి 9.40 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అమిత్ షా ఢిల్లీకి పయనమవుతారు.