టాలీవుడ్ సీనియర్ నటి ఆమని శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి అధికారికంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా గర్వించదగ్గ స్థాయికి చేరుకుందన్నారు. భారతీయురాలిగా గర్వపడేలా చేసిన ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాను అని ఆమని తెలిపారు. మోదీ ప్రభుత్వం సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆమె పేర్కొన్నారు. పదవుల కోసం కాకుండా, కేవలం సామాన్య ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు.సమాజానికి సేవ చేయాలనే కోరికతోనే బీజేపీలో చేరినట్లు తెలిపారు.