కేటీఆర్‌కు ఏసీబీ సమన్లు
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జనవరి 6వ తేదీ ఉదయం 10 గంటలకు ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణ రావాలని కోరుతూ సమన్లు జారీ చేసింది.
By Medi Samrat Published on 3 Jan 2025 6:04 PM ISTభారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జనవరి 6వ తేదీ ఉదయం 10 గంటలకు ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణ రావాలని కోరుతూ సమన్లు జారీ చేసింది. అంతకుముందు డిసెంబర్ 31న తెలంగాణ హైకోర్టు ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ అరెస్టుపై స్టేను పొడిగించింది.. కేటీఆర్ పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. అయితే.. విచారణ కొనసాగించేందుకు కోర్టు అనుమతించింది.
ఫార్ములా ఈ-రేస్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేటీఆర్‌కు సమన్లు పంపింది. ఇదే కేసులో విచారణ నిమిత్తం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మాజీ చీఫ్ ఇంజనీర్ (సీఈ) బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా ఈడీ సమన్లు జారీ చేసి, జనవరి 8న, జనవరి 9న హాజరు కావాలని ఆదేశించింది.
ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు మేరకు తెలంగాణ ఏసీబీ ఫార్ములా ఈ-కేసు నమోదు చేసింది. HMDA, UK ఆధారిత ఫార్ములా-ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (FEO) మధ్య చెల్లింపుల్లో రూ.54.88 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలు జరిగాయని తన ఫిర్యాదులో ఆరోపించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1)(A), 13(2) ప్రకారం.. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 409, 120(B)తో పాటు ACB FIR నమోదు చేసింది.
ACB కేసు తరువాత, ED KTR, అరవింద్ కుమార్, BLN రెడ్డిలపై PMLA కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార నివేదిక (ECIR) నమోదు చేసింది. అక్టోబర్ 2022లో తెలంగాణ ప్రభుత్వం, FEO, ఈవెంట్ స్పాన్సర్ Ace Nxt Gen Pvt Ltd మధ్య కుదిరిన హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా E రేసులో అసలు త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం.. రేసు కోసం మౌలిక సదుపాయాలు అందించడానికి ప్రభుత్వ పాత్ర పరిమితం చేయబడింది. అయితే ఒప్పందంలో ప్రత్యక్ష భాగస్వామి కానప్పటికీ హెచ్‌ఎండీఏ నిధులు బదిలీ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.