తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మహిళలు ఉచిత ప్రయాణం చేయాలంటే ఆధార్ కార్డులపై స్థానిక చిరునామా ఉన్నప్పటికీ రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని ఉందన్న కారణంగా పలువురు కండక్టర్లు ఉచిత ప్రయాణానికి మహిళలను అనుమతించని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు తీసుకున్న ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోని కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతోంది.
దీనిపై గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పందించారు. ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని చిరునామా ఉంటే చాలు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ కార్డుతో పాటు.. ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం జారీ చేసిన రెసిడెన్షియల్ అడ్రస్‌తో కూడిన గుర్తింపు కార్డులు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశారు. ఒకవేళ కండక్టర్లు నిరాకరిస్తే 04069440000 TOLL FREE నంబరు ఫిర్యాదు చేయాలన్నారు.