హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నో ఇళ్లను కూల్చిందని, కానీ ఒక్క ఇందిరమ్మ ఇంటిని కూడా నిర్మించలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదైనా పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2500 వంటి హామీలను అమలు చేయలేదని అన్నారు. మహిళలకు బస్సల్లో ఉచిత ప్రయాణం కల్పించారని, కానీ బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటికీ 50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్ షీట్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. రూ.4 వేల నిరుద్యోగ భృతి, ఏడాదికి 2 లక్షల జాబ్స్ వంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది జాబ్ క్యాలెండర్ కాదని.. జాబ్ లెస్ క్యాలెండర్ అని అన్నారు.