తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎలాంటి రేషన్ కార్డు ఉండాలని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పష్టత నిచ్చారు. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ ఆవరణలోని తన కార్యాలయంలో సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రస్తుతం తెల్ల రేషన్‌కార్డులున్న వారందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేస్తామన్నారు. అర్హులకు కార్డులు లేని పక్షంలో వారికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. అర్హులందరికీ ఫ్రీ కరెంట్ పథకాన్ని వర్తింపజేస్తామని.. ఎవరూ అపోహలకు పోవద్దని అన్నారు.
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో సంక్షేమ పథకాల అమలకు భారీగా బడ్జెట్ ను కేటాయించారు. మెుత్తం బడ్జెట్ 2,75,891 కోట్లు కాగా.. గ్యారంటీల అమలుకు 53,196 కోట్ల నిధులు కేటాయించారు. గృహజ్యోతి స్కీం 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ పథకం అమలు కోసం 2,418 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి మెుత్తంగా 16,825 కోట్ల కేటాయింపులు చేశారు