తమ హయాంలో అవినీతి జరిగినట్లు టీడీపీ ఒప్పుకుంటోందా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Sep 2020 5:56 AM GMT
తమ హయాంలో అవినీతి జరిగినట్లు టీడీపీ ఒప్పుకుంటోందా.?

హైకోర్టులో తెలుగుదేశంపార్టీ వాదన విచిత్రంగా ఉంది. 2014-19 మధ్య అధికారంలో ఉన్న తమ పార్టీ అనేక విషయాల్లో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేయాలని వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలంటూ టీడీపీ కోర్టులో కేసు వేయటమే విచిత్రంగా ఉంది. టీడీపీ హయాంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్లు వైసిపి చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమే అంటూ చంద్రబాబునాయుడు మొదలు క్రిందస్ధాయి నేతల వరకు ప్రభుత్వాన్ని పదే పదే సవాలు చేశారు. అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల పైనా కూడా ఎటువంటి విచారణైనా చేయించుకోండంటూ చాలా ధాటిగా టీడీపీ నేతలు మాట్లాడారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై రెండు మూడు రకాలుగా విచారణ జరిపించిన ప్రభుత్వం ఫైనల్ గా సిట్ ఏర్పాటు చేసింది. అయితే హఠాత్తుగా సిట్ విచారణను అడ్డుకుంటూ, తమ ప్రభుత్వం చేసిన నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం వైసీపీ ప్రభుత్వానికి లేదంటూ టీడీపీ సీనియర్ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్య కోర్టులో పిటీషన్ వేయటం ఆశ్చర్యంగా ఉంది. విచారణ వేయటానికి ముందేమో ఎటువంటి విచారణకైనా రెడీ అంటూ సవాలు చేసిన టీడీపీ తీరా విచారణ మొదలవ్వగానే అడ్డుకునేందుకు కోర్టులో ఎందుకు కేసు వేసిందో అర్ధం కావటం లేదు. పైగా తమ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేసే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని వాదించటమే ఆశ్చర్యంగా ఉంది.

తమ హయాంలో ఎటువంటి తప్పులు జరగలేదని ఒకవైపు చెబుతునే మరోవైపు విచారణను అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేశారంటే అర్ధమేంటి ? తమ హయాంలో ఎటువంటి తప్పులు జరగకపోతే విచారణను అడ్డుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముంది ? నిర్భయంగా విచారణ జరగనిస్తే తన నిర్దోషిత్వం నిరూపణ అవ్వటం చంద్రబాబుకు మంచిదే కదా ? ఏ విషయంలో అయినా తాను నిప్పునని పదే పదే చెప్పుకుంటున్న చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ అంటే ఎందుకింతగా భయపడుతున్నట్లు ? కోర్టులో టీడీపీ నేతల వాదనలు చూస్తుంటే అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే అనుమానాలు ప్రజల్లో పెరిగిపోతోంది.

అసెంబ్లీలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించినపుడు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టిందే చంద్రబాబు. ఇష్టం వచ్చినట్లుగా విచారణ చేసుకోండంటూ పదే పదే ప్రభుత్వాన్ని చంద్రబాబు సవాలు చేశాడు. నిజానికి ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి వైసిపి నేతలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ఎవరి పాపం ఎంత అనే విషయాలను రికార్డుల ఆధారంగా అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి చెప్పటం సంచలనంగా మారింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సిట్ విచారణను అడ్డుకునే ప్రయత్నాలు చేయటం ద్వారా తమ హయాంలో తప్పులు జరిగాయని టిడిపినే అంగీకరిస్తున్నట్లుగా పలువురు అనుమానిస్తున్నారు.

Next Story