ఏపీలో దళితులపై దాడులు.. జాతీయ కమిషన్లకు టీడీపీ నేతల వరుస లేఖలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 July 2020 7:15 AM GMT
ఏపీలో దళితులపై దాడులు.. జాతీయ కమిషన్లకు టీడీపీ నేతల వరుస లేఖలు

ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ టీడీపీ నేతలు గళమెత్తుతున్నారు. ఈ దాడులకు సంబంధించి పోరాటం చేస్తూ, జాతీయ కమిషన్లకు నేతలు వరుసగా లేఖలు రాస్తున్నారు. ఇటీవల దళితులపై జరుగుతున్న దాడులు, అన్యాయంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నేషనల్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ (NCSC), నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ (NCW)కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె లేఖలు రాశారు.తూర్పు గోదావరి జిల్లాలో 16 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారానికి సంబంధించిన అంశంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ కూడా చేశారు. దళితులు, మహిళల హక్కుల కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని, కులమదంతో కొట్టుకుంటూ ఇష్టానికి మాట్లాడేవారితో, దాడులు చేసే వారితో తన పోరాటమని, ప్రతిమనిషికి గౌరవంగా బ్రతికే హక్కు ఉంటుందని చెప్పే చంద్రబాబు స్ఫూర్తితో రాజీలేని పోరాటం చేస్తానని అనిత పేర్కొన్నారు. తనపై అసభ్యకామెంట్స్ పెట్టేవారి మీద త్వరలోనే ఎస్ఎంలో ఆధారాలతో ప్రయివేటు కేసు వేస్తానని హెచ్చరించారు.

మరో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కూడా ఓ దళిత యువకుడికి శిరోముండనం వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు లేఖ రాశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులపై దాడులు పెరిగిపోయాయని జాతీయ ఎస్సీ కమిషన్‌కు రాసిన లేఖలో ఆరోపించారు. అధికార పార్టీ నేతలు ఇసుక మాఫియాగా తయారవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు.

వారం రోజుల క్రితం, జూలై 18న అక్రమ ఇసుక లారీ విజయ్ అనే యువకుడిని ఢీకొట్టి గాయపరిచిందని, దీంతో వరప్రసాద్ అనే యువకుడు లారీనీ అడ్డుకున్నాడని ఆ లేఖలో వర్ల పేర్కొన్నారు. లారీని అడ్డుకున్నందుకు అతనిపై, అతనికి సహాయంగా వచ్చిన మరికొందరు యువకులపై వైసీపీ నేత జక్కంపూడి రాజా అనుచరుడు కాల్వ కృష్ణమూర్తి దాడి చేయడంతో పాటు సీతానగరం పోలిస్ స్టేషన్‌లో అక్రమ కేసులు బనాయించారని తెలిపారు.

వరప్రసాద్, అతనికి సహాయంగా వచ్చిన సందీప్, అనిల్, అఖిల్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైసీపీ నాయకుల ప్రోద్బలంతో లాఠీలతో చేతులపై అమానుషంగా కొట్టారని, దళిత యువకుడు వరప్రసాద్‌కు గుండు గీయించి అవమానించారని, 21వ తేదీన వారిని పోలీసులు విడుదల చేసినప్పటికీ, ఆసుపత్రిలో చేరకూడదని బెదిరించారని పేర్కొన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే వెంకటేష్, మాజీ ఎంపీ హర్ష కుమార్ వారికి సాయంగా వెళ్లి ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఓ దళితుడికి గుండు గీయించి, అవమానించడం చట్టరీత్యా శిక్షార్హమని, జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారినట్లు ఆరోపించారు.

Next Story
Share it