దానిపై సంతకం చేసేసిన ట్రంప్.. ఇక ముచ్చెమటలే.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 April 2020 6:37 AM GMT
దానిపై సంతకం చేసేసిన ట్రంప్.. ఇక ముచ్చెమటలే.!

అమెరికా.. పటిష్టమైన మెడికల్ కేర్.. కానీ కరోనాను నియంత్రించడంలో మాత్రం పక్కాగా ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కూడా అమెరికాను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ప్రస్తుతం కోవిద్-19 అమెరికాలో విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ట్రంప్ ఇతర దేశాల మీద తన అక్కసును ప్రదర్శిస్తూ వస్తున్నాడు. మొదట చైనాను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఆ తర్వాత ఇతర దేశాల కంటే తమ దేశం లోనే ఎక్కువ టెస్టులు చేశామని వెల్లడించారు. అమెరికన్లను రక్షించడమే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పిన ట్రంప్.. వలసలను కట్టడి చేస్తానని పిలుపునిచ్చారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వలసలపై నిషేధ ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను వైట్ హౌస్ తమ వెబ్సైట్ లో పొందుపరిచింది. కరోనా వైరస్ కారణంగా అమెరికన్ల జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయని.. అందుకే మర్చి 1, 2020న నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించామని తెలిపారు ట్రంప్. కరొనను కట్టడి చేయడానికి అమెరికన్లు సోషల్ డిస్టెన్సింగ్ ను పాటించడం మొదలుపెట్టారని.. మరిన్ని విషయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని అన్నారు. ఈ నిర్ణయాలు యునైటెడ్ స్టేట్స్ ఎకానమీ మీద తీవ్ర ప్రభావం చూపిందని.. ఎప్పుడు లేనంత స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. నేషనల్ ఎమర్జెన్సీని విధించినప్పటి నుండి ఏప్రిల్ 11, 2020 మధ్య 22 మిలియన్ల అమెరికన్లు నిరుద్యోగ దరఖాస్తులను అప్లై చేసుకున్నారు.

అమెరికాలో అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని అమెరికన్‌ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ వలసలపై నిషేధ ఉత్తర్వులను తీసుకుని వస్తున్నామన్నారు. వలసదారులపై 60 రోజుల నిషేధం విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అందుకు సంబంధించి నేషన్స్ ఇమ్మిగ్రేషన్ సిస్టంలో మార్పులు తీసుకుని రావాల్సిన సమయం వచ్చిందని వైట్ హౌస్ అభిప్రాయ పడింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగాల విషయంలో అమెరికన్లకే మొదటి ప్రాధాన్యత అని ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు.

ఉద్యోగాల కోసం రెండు నెలల పాటూ అమెరికాలో ఎవరినీ అడుగుపెట్టనివ్వమని ట్రంప్ తెలిపారు. వలసల తాత్కాలిక రద్దు అరవై రోజుల పాటు అమల్లో ఉంటుందని.. గ్రీన్‌ కార్డుల జారీని కూడా రెండు నెలలపాటు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. టూరిస్ట్‌, బిజినెస్‌, విదేశీ వర్కర్ల వంటి వీసాలపై ఎలాంటి నిషేధం వుండదని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాతే ఉత్తర్వులను సమీక్షస్తామన్నారు. ఏది ఏమైనా అమెరికా ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు ట్రంప్.

Next Story