రూటు మార్చుతున్న కరోనా: మరింత భయపెడుతున్న తాజా అంశం

By సుభాష్  Published on  23 April 2020 6:07 AM GMT
రూటు మార్చుతున్న కరోనా: మరింత భయపెడుతున్న తాజా అంశం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. చాపకిందనీరులా వ్యాపిస్తోంది. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచ దేశాలు సైతం పోరాటం చేస్తున్నాయి. అయితే కరోనా మహమ్మారి ఇప్పుడు రూటు మారుస్తోంది. ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే వైరస్‌ మనిషిలోకి ప్రవేశిస్తోంది. చూడడానికి మనిషిలో ఎలాంటి లక్షణాలు కనిపించకున్నా పరీక్షలు చేసిన తర్వాత పాజిటివ్‌ వస్తోంది. లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ వస్తుండటంతో వైద్యులు, అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. మనిషిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడానికి ఒక కారణమవుతోంది.

దాదాపు 80శాతానికిపైగా కరోనా ఉన్న వారికి ఎలాంటి లక్షణాలు బయటపడటం లేదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. ఇప్పుడు ఈ అంశం తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది.

భారత్‌లో 69 శాతం

ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్‌ తేలడం భారత్‌లో 69 శాతం వరకూ ఉందని, కరోనా సోకిన పది మందిలో ఏడుగురికి ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వారు క్వారంటైన్‌లో ఉండకపోతే వారికి తెలియకుండానే కరోనా వ్యాప్తి మరింత పెరిగి ప్రమాదం పొంచివుండే అవకాశాలున్నాయంటున్నారు.

Advertisement

ఇక దేశ వ్యాప్తంగా 19వేలకుపైగా కరోనా బాధితులుండగా, ఇందులో 13వేల మందికి ఎలాంటి కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని ఐసీఎంఆర్‌ పేర్కొంది. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల్లో 15శాతం రోగులు స్వల్పంగా అస్వస్థతకు గురవుతుండగా, 5శాతం రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

Next Story
Share it