అధికారుల్లో టెన్షన్‌: రెండు నెలల తర్వాత మళ్లీ కరోనా పాజిటివ్‌..!

By సుభాష్  Published on  22 April 2020 1:44 PM GMT
అధికారుల్లో టెన్షన్‌: రెండు నెలల తర్వాత మళ్లీ కరోనా పాజిటివ్‌..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ భయపెడుతోంది. ఉహాన్‌ నగరంలో గత ఏడాది డిసెంబర్‌లో పుట్టిన ఈ వైరస్‌.. ఇప్పుడు తగ్గుముఖం పట్టి ఇతర దేశాలను పట్టి పీడిస్తోంది. ఇప్పుడు చైనాలో మళ్లీ మెల్లమెల్లగా విజృంభిస్తోంది. ఇక తాజాగా ఓ విషయం ఆ దేశ వైద్యులను, అధికారులను కలవరపెడుతోంది. ఉహాన్‌ నగరంలో రెండు నెలల కిందట వైరస్‌ సోకి ఆస్పత్రి పాలై కోలుకున్న తర్వాత ఇప్పుడు మళ్లీ కరోనా పాజిటివ్‌ వస్తుండటంతో మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

ఉహాన్‌ నగరంలో కరోనా నుంచి కోలుకున్నవారిని అక్కడి పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వార్టర్లలో ఉంచారు. వారందరికి రెండు నెలల తర్వాత పరీక్షలు నిర్వహించగా, కొందరిలో మళ్లీ కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వైద్యులు షాకయ్యారు. ఇప్పుడు మళ్లీ పాజిటివ్‌ వచ్చిన వారందరు భయాందోళన చెందుతున్నారు. వీరిలో ధైర్యం నింపేందుకు చైనా ప్రభుత్వం ప్రత్యేకంగా మానసిక వైద్యులను నియమించింది.

ఇక రెండు నెలల తర్వాత మళ్లీ పాజిటివ్‌ రావడంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మళ్లీ ఎలా వచ్చిందో అంతుపట్టడం లేదు. చైనాను కంటిమీద కునుకులేకుండా చేసిన కరోనా.. కాస్త తగ్గిపోయిందని అనుకునేలోపే మళ్లీ విజృంభిస్తుండటంపై ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ప్రపంచ దేశాలు సైతం చైనాను దుమ్మెత్తిపోతున్నాయి. చైనాపై లోతుగా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇక అగ్రరాజ్య పెద్దన్న ట్రంప్‌ సైతం చైనాపై నిప్పుల కుంపటిగా మారిపోయారు. చైనా దేశమే వైరస్‌ సృష్టించి వదిలారని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. ప్రత్యేక బృందాల ద్వారా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story