Fact Check : సుశాంత్ సింగ్ సినిమాలను, సీరియల్స్ ను ఆన్ లైన్ నుండి తీసివేస్తున్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 July 2020 3:22 PM IST
Fact Check : సుశాంత్ సింగ్ సినిమాలను, సీరియల్స్ ను ఆన్ లైన్ నుండి తీసివేస్తున్నారా..?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పట్ల బాలీవుడ్ లోని ఓ వర్గాన్ని ప్రజలు బాగా తిడుతూ ఉన్నారు. ముఖ్యంగా సిబిఐ ఎంక్వయిరీ వేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. 'పవిత్ర రిస్తా' లాంటి సీరియల్స్ ను చేసుకుంటూ వచ్చి సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ సరైన గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలీవుడ్ లోని పాలిటిక్స్ సుశాంత్ ను బలితీసుకున్నాయని అంటున్నారు. ఇలాంటి సమయంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన సీరియల్ ను యుట్యూబ్ నుండి తీసేశారని, సుశాంత్ సినిమాలను పలు ఓటీటీ సైట్స్ తీసివేస్తున్నాయని ఆరోపిస్తూ కొందరు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు.



@puspendraarmy అనే ట్విట్టర్ అకౌంట్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సీరియల్ 'పవిత్ర రిస్తా' ను యూట్యూబ్ నుండి తీసేశారని, ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో లేకుండా చేసారంటూ ట్వీట్ చేశారు. జీ టీవీ కూడా తమ యూట్యూబ్ ఛానల్ నుండి సుశాంత్ సీరియల్ ను తీసేసిందని పలువురు ఆరోపించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు ఇకపై వినిపించకూడదు అని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్టులు పెట్టారు.

నిజ నిర్ధారణ:

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన సీరియల్స్, సినిమాలను డిలీట్ చేస్తున్నారన్నది 'పచ్చి అబద్ధం'

పవిత్ర రిస్తా సీరియల్ కు సంబంధించిన ప్లే లిస్ట్ జీ టీవీ యూట్యూబ్ ఛానల్ లో కనిపించలేదు. జీ టీవీ వెబ్ సైట్ లో కూడా ఎపిసోడ్స్ లేవు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోగానే చాలా మంది అతడు నటించిన సీరియల్ ను చూడాలని అనుకున్నారు. దీంతో జీ టీవీ సంస్థ ఆ సీరియల్ ను తమ యూట్యూబ్ లో నుండి తీసేసి Zee5 ఓటీటీ యాప్ లో ఉంచింది. తమ యాప్ ను పాపులర్ చేసుకోడానికి జీ సంస్థ ఇలా చేసింది.

సీరియల్ కు సంబంధించిన పూర్తీ ప్లే లిస్ట్ Zee TV YouTube channel లో అందుబాటులో లేకపోయినప్పటికీ, ఇంతకు ముందు అప్లోడ్ చేసిన ఎపిసోడ్స్ అలాగే ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ నుండి ఎం.ఎస్.ధోనీ సినిమాను తీసివేశారని కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఎం.ఎస్.ధోనీ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్ లో ఉంది. యుట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది ఈ చిత్రం.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన కాయ్ పోచే, చిచోరే, డ్రైవ్ లాంటి సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో అందుబాటులో ఉన్నాయి.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరును చెరిపేయాలని కొందరు ప్రవర్తిస్తున్నారని.. అందుకే అతడు నటించిన సినిమాలు, సీరియల్ ను తీసివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం 'పచ్చి అబద్ధం'

Next Story