సూర్య కొత్త సినిమా విడుదల వాయిదా.. ఎందుకంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Oct 2020 7:29 PM ISTవిభిన్న కథాంశాలతో ఉండే సినిమాలను చేయడానికి ఇష్టపడే హీరో సూర్య. అందుకనే ఆయనకు తమిళంలో పాటు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన సుధా కొంగర దర్శకత్వంలో నటించిన చిత్రం ‘సూరరై పోట్రు’ తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలవుతుంది. ఈ చిత్రంలో సూర్య సరసన అపర్ణ బాలమురళీ నటిస్తోంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సూర్యతో పాటు మోహన్ బాబు కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు.
మే 1 ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే.. కరోనా లాక్‌డౌన్ కారణంగా విడుదల కాలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 30న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. అయితే.. అనుకోని విధంగా పోస్ట్‌పోన్ అయ్యింది. ఈ విషయాన్ని సూర్య ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. ఈ సినిమా విమానయాన రంగానికి చెందిన థీమ్ కావడంతో యూనిట్ నిజమైన ఎయిర్ ఫోర్స్ లొకేషన్లలో, నిజమైన విమానాలతో షూటింగ్ చేశారు.
ఈ చిత్రీకరణ కోసం విమానయాన రంగం నుండి, దేశ భద్రతా విభాగం నుండి అనేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. అయితే విడుదలకు కూడా విమానయాన శాఖ నుండి కొన్ని ఎన్ఓసీలు రావాల్సి ఉందట. అవి ఆలస్యమయ్యేలా ఉండటంతో 30వ తేదీన రిలీజ్ చెయ్యట్లేదని, వాయిదా వేస్తున్నామని..సూర్య లేఖ ద్వారా తెలిపారు. ఇక కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమాలో సూర్య పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు.