మెడిక‌ల్ కాలేజీల్లో 50శాతం ఓబీసీ కోటాకు సుప్రీం నో..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2020 2:02 PM GMT
మెడిక‌ల్ కాలేజీల్లో 50శాతం ఓబీసీ కోటాకు సుప్రీం నో..!

త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ప్ర‌భుత్వ ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న వైద్య క‌ళాశాల్ల‌లో 50 శాతం ఓబీసీ రిజ‌ర్వేష‌న్‌కు అనుమ‌తించాలంటూ ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సుప్రీం కోర్టుం కొట్టివేసింది. ఈ ఏడాది 50 శాతం ఓబీసీ రిజర్వేషన్ ను పొడిగించడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొనడంతో దీన్ని సవాలు చేస్తూ.. అధికార పార్టీ అన్నాడీఎంకే, ప్ర‌తిప‌క్ష పార్టీ డీఎంకే లు సుప్రీంకోర్టుకెక్కాయి.

ఈ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ ఎల్‌.నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది. మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి తమిళనాడు సరెండర్ చేసిన ఆలిండియా సీట్లలో ఓబీసీ కోటాను నిర్ధారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు గత జులై 27 న కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉండాలని సూచించింది. అయితే ఈ కమిటీ తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్ విద్యా సంవత్సరాలకు మాత్రమే వర్తించేలా ఉండాలి తప్ప.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి కాదని స్పష్టం చేసింది.

అయితే.. విద్యార్థులు జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రిలోనే ద‌ర‌ఖాస్తులు నింపినందున వారికి ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల ప్ర‌యోజ‌నాల‌ను విస్త‌రించ‌డం ఈ ఏడాది సాధ్యం కాద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే సుప్రీం కోర్టుకు కూడా తెలిపింది. దీంతో పిటిష‌న్ల విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం ఈ ఏడాది 50 శాతం ఓబీసీల‌కు కేటాయించాల‌న్న త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించింది.

Next Story
Share it