సుప్రీం తాజా తీర్పు.. మొబైల్ టారిఫ్ లు ఎంత పెరుగుతాయంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Sep 2020 7:57 AM GMT
సుప్రీం తాజా తీర్పు.. మొబైల్ టారిఫ్ లు ఎంత పెరుగుతాయంటే?

టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. టెలికమ్యునికేషన్స్ శాఖకు చెల్లించాల్సిన స్థూల బకాయిల్ని పదిహేను నుంచి ఇరవై ఏళ్ల గడువు ఇవ్వాలంటూ దాఖలు చేసిన టెలికం కంపెనీల పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అంతేకాదు.. పదేళ్లలో బకాయిల్ని చెల్లించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో వచ్చే ఏడాది మార్చిలోపు తామున్న బకాయిల్లో పదిశాతం చెల్లించిన కంపెనీలకు మాత్రమే చెల్లింపు అర్హత లభిస్తుందని పేర్కొంది.

అనంతరం మిగిలిన బకాయిల్ని 2022 నుంచి పదేళ్ల పాటు పది వాయిదాల్లో చెల్లించే వీలుందని చెప్పింది. టెలికం కంపెనీలు రూ.1.69లక్షల కోట్ల బకాయిలు పడ్డాయి. వీటిల్లో రూ.29వేల కోట్లను ఇప్పటికే చెల్లించారు. దీంతో టెలికం కంపెనీలకు రూ.1.4లక్షల కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని రానున్న పదేళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఏటా ఎనిమిది శాతం వడ్డీతో ఈ బకాయిల్ని తీర్చాల్సి ఉంటుంది.

సుప్రీం తాజా తీర్పుతో వోడాఫోన్ తోపాటు ఎయిర టెల్ కు తిప్పలు తప్పవంటున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. వోడాఫోన్ దగ్గరదగ్గర రూ.50,400 కోట్లు చెల్లించాల్సి వస్తే.. ఎయిర్ టెల్ రూ.25,985 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత భారీ మొత్తం కంపెనీలు భరించలేవంటున్నారు. అందుకే.. ఈ బకాయిలపై మరోసారి రివ్యూ పిటిషన్ దాఖలు చేసే వీలుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. కోర్టు పేర్కొన్న దాని ప్రకారం వచ్చే ఏడాది మార్చి నాటికి ఎయిర్ టెల్ రూ.2600 కోట్లు.. వోడాఫోన్ రూ.5వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మరింత భారీ మొత్తాన్ని చెల్లించేందుకు అవసరమైన నిధుల్ని.. కచ్ఛితంగా వినియోగదారుల నుంచే వసూలు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే టెలికం కంపెనీలు కనిష్ఠంగా పది శాతం నుంచి గరిష్ఠంగా 23 శాతం మేర తమ టారిఫ్ లు పెంచుకునే వీలున్నట్లు చెబుతున్నారు. సుప్రీం తీర్పు ఏమో కానీ.. అంతిమంగా జనాల జేబులకు చిల్లులుపడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. టెలికం కంపెనీల చెల్లింపులేమో కానీ.. ప్రజలకు కొత్త భారం తప్పనట్లే.

Next Story
Share it