రాఫెల్ కొట్టివేత.! రాహుల్.. జాగ్రత్తగా వ్యవహరించు.!
By Medi Samrat
గత కొద్ది కాలంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కేసులలో అంతిమ తీర్పులను నేడు సుప్రీం వెల్లడించింది. మొదటగా.. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. రాఫెల్ పై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ అవసరంలేదని స్పష్టం చేసింది. ఈ కేసులో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించినట్లయింది.
అంతకుముందు.. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువడింది.
ఇక.. రాఫెల్ ఒప్పందంపై ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ వ్యాఖ్యానించడం.. తన విమర్శను సుప్రీం తీర్పునకు ఆపాదించడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చౌకీ దార్ చోర్’ వ్యాఖ్యలను రాహుల్ తమకు ఆపాదించడం దురదృష్టకరమని పేర్కొంది.
రాహుల్ ను భవిష్యత్ లో జాగ్రత్తగా వ్యవహరించాలన్న కోర్టు.. ఆయన పెట్టుకున్న క్షమాపణను అంగీకరించింది. అలాగే.. ఆయనపై దాఖలైన పరువునష్టం కేసును కొట్టేసింది.