హరీష్ కథ.. సునీల్ హీరో.. టైటిల్ ఇదిగో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Aug 2020 11:52 PM GMT
హరీష్ కథ.. సునీల్ హీరో.. టైటిల్ ఇదిగో

లాక్ డౌన్ టైంలో టాలీవుడ్లో ఎన్నో కొత్త కాంబినేషన్లు సెట్ అయ్యాయి. అనేక కొత్త సినిమాలు ప్రకటించారు. ఈ వరుసలోనే ఇప్పుడు మరో ఆసక్తికర కాంబినేషన్ ఓకే అయింది. ఆ సినిమాను సోమవారమే ప్రకటించారు. ఈ సినిమా పేరు.. వేదాంతం రాఘవయ్యా కావడం విశేషం. ఈ చిత్రానికి కథ అందించింది స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.

ఇందులో వేదాంతం రాఘవయ్య పాత్ర పోషిస్తున్నది కమెడియన్ సునీల్ కావడం మరో విశేషం. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. ఇలా డైరెక్టర్ ఖరారవ్వకుండా హీరో, కథకుడు, నిర్మాతల పేర్లతో టైటిల్ లోగోను ఆవిష్కరించడం ఆసక్తికరమే. అతి త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది 14 రీల్స్ ప్లస్ సంస్థ.

14 రీల్స్ ప్లస్ బేనర్లోనే హరీష్ తన చివరి సినిమా ‘గద్దలకొండ గణేష్’ తీశాడు. ఇంతకుముందు ‘14 రీల్స్’ బేనర్ మీద అనిల్ సుంకరతో కలిసి రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట భారీ సినిమాలు తీశారు. అనిల్ నుంచి విడిపోయి ‘14 రీల్స్ ప్లస్’ బేనర్ పెట్టుకుని తొలిసారిగా ‘గద్దలకొండ గణేష్’ సినిమాను నిర్మించి మంచి ఫలితాన్నే అందుకున్నారు. ఇటీవలే మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాను అనౌన్స్ చేసిందీ సంస్థ.

దానికి సమాంతరంగా ఇప్పుడు ‘వేదాంతం రాఘవయ్య’ సినిమాను నిర్మించనున్నారు. నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన వేదాంతం రాఘవయ్య తొలితరం తెలుగు సినిమాను ముందుకు నడిపించిన దిగ్గజాల్లో ఒకరు. ‘దేవదాసు’ సహా ఎన్నో అద్భుతమైన సినిమాలను ఆయన అందించారు. తెలుగు సినిమా పితామహుల్లో ఒకడైన ఆయన జీవిత కథ నేపథ్యంలోనే హరీష్ ఈ కథ రాశాడని అర్థమవుతోంది. దీనికి సునీల్‌ను హీరోగా ఎంచుకోవడం ఆసక్తి రేకెత్తించేదే. మరి ఈ బయోపిక్‌ను డైరెక్ట్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారో చూడాలి.

Next Story