తడిసి ముద్దైన పంటలు.. వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతుల ఆశలు ఆవిరి.!

By అంజి  Published on  7 March 2020 10:01 AM GMT
తడిసి ముద్దైన పంటలు.. వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతుల ఆశలు ఆవిరి.!

హైదరాబాద్‌: అకాల వర్షాలు.. రైతుల ఆశలను ఆవిరి చేశాయి. ఇగ పంట చేతికొస్తుందన్న సమయంలోనే అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసింది. గత మూడు రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిర్చి, పత్తి, పుచ్చ తోటలు, వరి, మొక్కజొన్న తోటలు వర్షం కారణంగా నాశనం అయ్యాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఏమి చేయాలో తోచక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మొలకల చెరువులో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లుపై జనజీవనం స్థంభించింది. భారీ వర్షం కురవడంతో టమోటా పంటకు తీవ్రంగా నష్టం జరగడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పంటలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల రైతులు పంటలపై టార్పాలిన్‌ పట్టాలు కప్పారు. పంటను అమ్ముకొని అప్పులు తీర్చుకుందామనుకున్న రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి.

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 15 వేల ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతింది. చాలా మంది రైతులు తమ ఇంటి దగ్గర కల్లాల్లో మిర్చి పంటను ఆరబెట్టుకున్నారు. ఒక్కసారిగా వర్షం పడడంతో పంట తడిసి ముద్ద కావడంతో.. రైతుల కళ్లలో కారం పడినట్లైంది. పినపాక మండలంలో సుమారు 200 క్వింటాళ్ల మిర్చి తడిసింది. అలాగే పాల్వంచ, జూలురుపాడులో కూడా పంటలు తడిసాయి. దాదాపు రూ.2 కోట్ల మేర నష్టం వాటిలినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

Also read:

పులిని పట్టేందుకు వచ్చాడు.. కరుసైపోయాడు

అశ్వారావుపేటలో ఉదయం 6.30 నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోందని ఈనాడు దినపత్రిక తెలిపింది. వర్షం కారణంగా వర్జీనియా పోగాకు గండం వచ్చినట్లైంది. ఆకు కొట్టే దశలో వర్షం రావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇదిలా ఉంటే పలు చోట్ల మామిడితోటల్లో నల్లమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.

రాగల మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపినట్లుగా ఓ మీడియా సంస్థ చెప్పింది.

Next Story