పులిని పట్టేందుకు వచ్చాడు.. కరుసైపోయాడు

By సుభాష్  Published on  6 March 2020 8:18 AM GMT
పులిని పట్టేందుకు వచ్చాడు.. కరుసైపోయాడు

అటవీ శాఖ చొరవతో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని కాగజ్ నగర్ అటవీ విభాగంలో పులులను వేటాడటం, చంపేయడం బాగా తగ్గింది. అయితే అక్రమ వేటగాళ్ల కదలికలు పూర్తిగా తగ్గిపోయాయని భావిస్తే మాత్రం పొరబాటే అవుతుంది. ఇటీవలే నాలుగు రోజుల క్రింద పంటపొలాల్లో వేసిన విద్యుత్ కంచెను తాకి ఒక వేటగాడు చనిపోయిన సంఘటన ఇప్పటికీ వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు ఉన్నదన్న సంగతిని గుర్తు చేస్తోంది.

వెంపల్లి ఫారెస్ట్ సెక్షన్ లోని అచిల్లి గ్రామంలో కొందరు వన్యప్రాణులను చంపేందుకు గ్రామ సరిహద్దుల్లో విద్యుత్ కంచెను వేశారు. కానీ అదే గ్రామానికి చెందిన లావుడియా నరేశ్ అనే వ్యక్తి ఆ కంచెలో చిక్కుకుని చనిపోయాడు. నరేశ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు వన్య జంతువులను చంపేందుకు పథకం పన్నారు. అందులో ఇద్దరు తప్పించుకోగా, ఒకరు మాత్రం విద్యుత్ కంచెకు తగిలి విద్యుద్ఘాతంతో చనిపోయారని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న పులులు ఈ కంచెలో చిక్కుకుని ఉంటే అవి కూడా చనిపోయేవని అధికారులు అంటున్నారు. పులులను కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఒక రోజు ముందే జంతువులను పట్టకునే పగ్గాలు, వలలను, వైర్లను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. అయినా ఈ సంఘటన జరగడం పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు.

అయితే అటవీ శాఖాధికారులు అసలు ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని, కేవలం ఒక డ్రామా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని వన్యప్రాణి సంరక్షణవాదులు ఆరోపిస్తున్నారు. కెమెరాల్లో తేదీలను మార్చి పాత ఫోటోలను కొత్త ఫోటోలుగా చూపించి, తాము పనిచేస్తున్నట్టు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని వారంటున్నారు.

Next Story