Fact Check : దళిత సైనికుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Sep 2020 5:22 AM GMTతల లేకుండా ఉన్న ఓ సైనికుడి ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ సైనికుడి విగ్రహం మీద కూడా కులం అనే మచ్చ వేశారని.. అందుకే అతడి తలను విగ్రహం మీద లేకుండా చేశారని పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఆ సైనికుడు దళితుడు కావడంతోనే ఈ పని చేశారని నెటిజన్లు చెబుతూ వస్తున్నారు.
'చూడండి మనుషులు ఎంత కౄరత్వంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనమేమో ప్రపంచంలోనే గొప్ప దేశం అవుతుందని భావిస్తూ ఉన్నాము. కానీ ఇలాంటి వారు ఉంటే అది సాధ్యమేనా..! గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి దేశం కోసం ప్రాణాలను అర్పించాడు. ఆయన స్మృత్యర్థం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ సైనికుడు షెడ్యూల్డ్ కులానికి చెందిన వాడు. అదే ప్రజలకు నచ్చలేదు. దీంతో ఆ స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేశారు' అని హిందీలో ఆ ఫోటోల కింద పోస్టు వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ:
వైరల్ ఫోటోలో ఉన్న స్మారక చిహ్నంలో ఉన్న సైనికుడు 'మహేష్ పాల్'. అతడు దళిత కులానికి చెందిన వాడు కాదు.
న్యూస్ మీటర్ దీనిపై గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వైరల్ అవుతున్న ఫోటో జులై 2018 చేసిన ట్వీట్ కు సంబంధించినది. ఆ ట్వీట్ ప్రకారం ఆ విగ్రహం షాహీద్ మహేష్ పాల్ సింగ్ కు చెందినది. హర్యానా రాష్ట్రం, మహేంద్రఘర్ జిల్లాలోని ధనొందా గ్రామంలో చోటు చేసుకుంది. కొన్ని కీ వర్డ్స్ ను ఉపయోగించి ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ గురించి తెలుసుకోవచ్చు.
Daily Bhasker కథనం ప్రకారం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అజయ్ కుటుంబానికి ఆ గ్రామ సర్పంచ్ కు మధ్య గొడవలు ఉన్నాయి. గ్రామ సర్పంచ్ పరువు తీయాలని భావించి మహేష్ పాల్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు అజయ్.
Dainik Jagran జులై 2018 కథనం ప్రకారం కొందరు ఆకతాయిలు విగ్రహాన్ని ధ్వంసం చేశారని.. అందుకు నిరసనగా గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు.
Punjab Kesari ప్రకారం అమరుడైన మహేష్ పాల్ 'రాజ్ పుతానా రైఫిల్స్' దళంలో సభ్యుడు.1988 లో శాంతి సేనలో భాగంగా శ్రీలంకకు వెళ్ళాడు. జనవరి 17, 1989 లో జఫ్ఫానా సెక్టర్ లో తీవ్రవాదుల దాడిలో మరణించాడు. జనవరి 2014న మహేష్ పాల్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అమరుడైన మహేష్ పాల్ సింగ్ రాజ్ పుత్ కుటుంబానికి చెందిన వాడు.. దళిత కుటుంబానికి చెందిన వాడు కాదు. ఆయన విగ్రహం హర్యానా రాష్ట్రం లోని ధనొందా గ్రామంలో ఉంది కానీ.. గుజరాత్ లో కాదు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.