డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ల్యూక్ హార్పర్ హఠాన్మరణం
WWE Super Star Luke Harper Dies Due To Lung Issue. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన షోలు చూసే వారికి
By Medi Samrat Published on 27 Dec 2020 5:14 PM IST
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన షోలు చూసే వారికి 'ల్యూక్ హార్పర్' పరిచయం అక్కరలేని పేరు. ఎన్నో ఈవెంట్స్ లో అందరినీ అలరించాడు. అటువంటి వ్యక్తి ఇక లేరు. లూక్ హార్పర్, బ్రాడి లీగా పేరొందిన అమెరికా ప్రొఫెషనల్ రెజ్లర్ జొనాథన్ హుబర్ అనారోగ్యంతో మరణించారు. శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న జోనాథన్.. శనివారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. జొనాథన్ హుబర్ మరణంపై వస్తున్న వదంతులను నమ్మకండని.. కరోనా సోకి మరణించలేదని అతడి భార్య వెల్లడించింది.
1979లో న్యూయార్క్‌లో జన్మించిన హ్యూబర్ రెజ్లర్‌గా 1990లో తన కెరీర్ ప్రారంభించారు. 2003లో రోచెస్టర్ ప్రోరెజ్లింగ్‌లో బ్రోడై లీ పేరుతో రింగ్‌లోకి దిగారు. 1995లో కెవిన్ స్మిత్ సినిమా మాల్‌రాట్స్‌లో ఓ పాత్ర పోషించారు. 6 అడుగుల 5 అంగుల పొడవు, 275 పౌండ్ల బరువుతో ఆజాను బాహుడిగా కనిపించేవాడు. గుబురు గడ్డం, మీసంతో కనిపించే హర్పర్ ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ను రెండు సార్లు గెలిచిన హుబర్, ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఏఈడబ్ల్యూలో చేరిన తర్వాత ఏఈడబ్ల్యూ టీఎన్‌టీ చాంపియన్‌షిప్ గెలిచాడు. 2012 డబ్ల్యూ డబ్ల్యూఈలో అడుగుపెట్టిన జోనాథన్.. ఫ్లొరిడా చాంపియన్ షిప్, ఎన్‌ఎక్స్‌టీ ట్యాగ్ టీమ్ చాంపియన్ షిప్‌లను గెలచుకున్నాడు. డబ్ల్యూ డబ్ల్యూఈలో అడుగుపెట్టగానే అతడికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది.
జోనాథన్ అకాల మరణం పట్ల రెజ్లింగ్ లోకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పలువు స్టార్ రెజ్లర్లు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. 'జోనాథన్ హుబెర్ మరణం విషాదానికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాం'' అని డబ్ల్యూడబ్ల్యూఈ ట్వీట్ చేసింది. పలువురు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్లు హార్పర్ మృతికి ట్విటర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.