మహిళల వన్డే ప్రపంచకప్.. భారత్ ఓటమి.. సెమీస్ చేరిన ఆసీస్
Women's World Cup Australia Beat India By 6 Wickets.ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భారత జట్టు మరో ఓటమి
By తోట వంశీ కుమార్ Published on 19 March 2022 3:08 PM ISTఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భారత జట్టు మరో ఓటమి చవిచూసింది. ఆక్లాండ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల విజయం సాధించింది. భారత జట్టు నిర్ధేశించిన 278 లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి 49.3 ఓవర్లలో చేధించింది. ఓపెనర్లు అలిస్సా హేలి(72; 65 బంతుల్లో 9 పోర్లు), రేచల్ హేన్స్( 43; 53 బంతుల్లో 5 పోర్లు) శుభారంభాన్ని అందించగా.. కెప్టెన్ మెగ్ లానింగ్ (97; 107 బంతుల్లో 13 పోర్లు), బెత్ మూనీ(30 నాటౌట్; 20 బంతుల్లో 4 పోర్లు) రాణించడంతో ఆస్ట్రేలియా సులువుగా విజయాన్ని అందుకుంది.
అంతకముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్(68; 96 బంతుల్లో 4పోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా( 59; 83 బంతుల్లో 6 పోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్(57; 47 బంతుల్లో 6 పోర్లు ) అర్థశతకాలతో రాణించగా.. ఆఖర్లో పూజా వస్త్రాకర్ (34; 28 బంతుల్లో 1పోర్, 2 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ మంచి స్కోర్ సాధించింది.
బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన(10), షెఫాలి వర్మ(12)లు ఇద్దరూ తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. దీంతో భారత్ 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీరాజ్, యస్తిక రాజ్ ఇన్నింగ్స్ బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. తొలుత ఆచితూచి ఆడిన ఈ జోడి తరువాత పరుగుల వరద పారించింది. ఈ క్రమంలో మూడో వికెట్‌కు 130 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అర్థశతకాలు పూర్తి చేసుకున్న తరువాత స్వల్ప వ్యవధిలో ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఆ తరువాత వచ్చిన రీచా ఘోష్(8), స్నేహ్‌రాణా(0) విఫలమైన హర్మన్, పూజా వస్త్రాకర్ ధాటిగా ఆడడంతో భారత్.. ఆస్ట్రేలియా ముందు 278 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఈ విజయంతో ఆడిన 5 మ్యాచుల్లో గెలిచిన ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానికి చేరుకుని సెమీస్ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఇక టీమ్ఇండియా 5 మ్యాచులు ఆడగా.. రెండు విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇండియా సెమీస్ చేరాలంటే ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించాల్సిందే
With 10 points on the board, Australia have officially sealed a spot in the #CWC22 semi-finals 🌟 pic.twitter.com/2DJ6C2dnc0
— ICC (@ICC) March 19, 2022