ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కి ముహూర్తం ఫిక్స్‌.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?

Women's Premier League to begin on March 4.ఉమెన్స్‌ ప్రీమియ‌ర్ లీగ్‌(డ‌బ్ల్యూపిఎల్‌) కు ముహూర్తం ఖ‌రారైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Feb 2023 6:50 AM GMT
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కి ముహూర్తం ఫిక్స్‌.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉమెన్స్‌ ప్రీమియ‌ర్ లీగ్‌(డ‌బ్ల్యూపిఎల్‌) కు ముహూర్తం ఖ‌రారైంది. మ‌హిళ‌ల ఐపీఎల్ మార్చి 4 నుంచి 26 జ‌ర‌గ‌నుంది. ముంబైలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 22 రోజులు పాటు డ‌బ్ల్యూపిఎల్ అభిమానుల‌ను అల‌రించ‌నుంద‌ని ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నున్నాయ‌ని చెప్పారు.

ఆట‌గాళ్ల వేలం ఎప్పుడు నిర్వ‌హించ‌నున్నారు అనే విష‌యాన్ని చెప్పారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌, పాకిస్థాన్‌లు త‌ల‌ప‌డిన‌ మ‌రుస‌టి రోజు అంటే ఫిబ్రవరి 13న వేలం జ‌ర‌గ‌నుంది.

ఐపీఎల్ యాజ‌మాన్యాలే డ‌బ్ల్యూపిఎల్ ఐదు ప్రాంఛైజీల‌ను కొనుగోలు చేశాయి. ఐదు ఫ్రాంఛైజీల అమ్మకం ద్వారా రూ.4,670 కోట్లు, మీడియా హక్కుల వేలం ద్వారా రూ.951 కోట్లు బీసీసీఐకి వ‌చ్చాయి. ఈ రెండింటి ద్వారా ప్రపంచంలో ఐపీఎల్ తర్వాత రెండో అతిపెద్ద టీ20 లీగ్ గా డబ్ల్యూపీఎల్ నిల‌వ‌నుంది.

ఆట‌గాళ్ల వేలం కోసం ఇప్ప‌టికే 1500 మంది ప్లేయ‌ర్లు రిజిస్ట‌ర్ చేసుకున్నారు. వీరిని షార్ట్ లిస్ట్ చేయ‌నున్నారు. మ‌రో రెండు మూడు రోజుల్లో ఈ లిస్ట్ రానుంది. వేలంలో ఒక్కొ టీమ్ క‌నీసం 15 మందిని కొనుగోలు చేయొచ్చు. గ‌రిష్టంగా 18 మందిని తీసుకోవ‌చ్చు. మ్యాచ్‌లో అసోసియేట్ సభ్య దేశానికి చెందిన ఒకరితో సహా ఐదుగురు విదేశీ ఆటగాళ్లు ఆడొచ్చు.

ఈ ప్రారంభ సీజ‌న్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు ఉండ‌నున్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌ను నిర్వ‌హిస్తారు. ఇందులో విజేత‌గా నిలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంటుంది.

Next Story