డబ్ల్యూపీఎల్ వేలానికి వేళాయె.. కోట్లు కొల్లగొట్టేదెవరో?

Women's Premier League 2023 auction today.బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో తొలిసారి డబ్ల్యూపీఎల్ లీగ్‌ను నిర్వ‌హించ‌నున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2023 1:04 PM IST
డబ్ల్యూపీఎల్ వేలానికి వేళాయె.. కోట్లు కొల్లగొట్టేదెవరో?

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆధ్వ‌ర్యంలో తొలిసారి ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌(డబ్ల్యూపీఎల్) ను నిర్వ‌హించ‌నున్నారు. డబ్ల్యూపీఎల్ లీగ్ కోసం సోమవారం వేలాన్ని నిర్వ‌హిస్తున్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నాం 2.30 గంట‌ల‌కు వేలం ప్రారంభం కానుంది. డబ్ల్యూపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న స్పోర్ట్స్ 18, జియో సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వేలం ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కానుంది.

టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, యువ సంచలనం షెఫాలీ వర్మ‌లపైనే అంద‌రి దృష్టి నెల‌కొంది. వీరితో పాటు విదేశీయులు అలీసా హేలీ, బేత్‌ మూనీ, ఎలిస్‌ పెర్రీ, మెగాన్‌ షట్‌ (ఆస్ట్రేలియా) నాట్‌ సీవర్‌ (ఇంగ్లండ్‌), డాటిన్‌ (వెస్టిండీస్‌)ల‌కు భారీ ధ‌ర ప‌లికే అవ‌కాశం ఉంది.

మొత్తం 409 మంది క్రీడాకారిణులు ఈ వేలంలో పాల్గొన‌నున్నారు. వీరిలో 90 మందిని ఐదు ఫ్రాంచైజీలు కొనుగోలు చేయ‌నున్నాయి. ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్జ్ ప్రాంఛైజీలు వేలంలో ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌నున్నాయి. ఒక్కొ ఫ్రాంచైజీ రూ.12 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసేందుకు బీసీసీఐ అనుమ‌తి ఇచ్చింది.

ఒక్కొ ప్రాంఛైజీ 18 మందిని కొనుగోలు చేయొచ్చు. క‌నీసం 15 మందిని తీసుకోవాలి. వీరిలో ఆరుగురు విదేశీ ఆట‌గాళ్లు ఉండాలి. ఆట‌గాళ్ల క‌నీస ప్రారంభ ధ‌ర రూ.10ల‌క్ష‌లు కాగా.. అత్య‌ధిక ధ‌ర రూ.50ల‌క్ష‌లు.

స్మృతి మంధ‌న‌, షెఫాలీ, హర్మన్‌ప్రీత్‌, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మలకు రూ.1.25 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ధ‌ర ప‌ల‌కొచ్చున‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. 246 మంది టీమ్ఇండియా క్రికెటర్లు, 163 మంది విదేశీ క్రికెటర్లు వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Next Story