IPL 2025 : జట్టులో చోటు దక్కుతుందో.. లేదో.. ఈ సీజన్‌లో తొమ్మిది సెంచరీలు బాదిన కరుణ్ నాయర్ ఎందుకిలా అంటున్నాడు.?
కరుణ్ నాయర్ ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా భారత జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు.
By Medi Samrat
కరుణ్ నాయర్ ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా భారత జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. నాయర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన అద్భుతమైన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే.. IPLలో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడనున్నాడు.
ఐపీఎల్ తర్వాత భారత జట్టు జూన్‌లో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు బయలుదేరుతుంది. టెస్టు క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచిన కరుణ్ నాయర్‌ను సెలక్టర్లు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నది చర్చనీయాంశమైంది.
జూన్‌లో జరిగే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు జట్టులో మీరు ఉంటారా అని నాయర్‌ను అడిగినప్పుడు.. అతడు "ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఐపీఎల్‌పై ఉంది" అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్ గురించి ఆలోచించడం లేదని బదులిచ్చాడు. అయితే, ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన తర్వాత కచ్చితంగా టీమ్ ఇండియాలోకి తిరిగి రావాలనుకుంటున్నాను. భారత జట్టులో తన ఎంపికపై ఇంకా ఏ అధికారితోనూ మాట్లాడలేదని కూడా స్పష్టం చేశాడు.
ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో నాయర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతను తొమ్మిది మ్యాచ్‌ల్లో 779 పరుగులు చేశాడు.. ఇందులో ఐదు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. అతని సగటు 389.50. దీంతోపాటు రంజీ ట్రోఫీలోనూ తన అద్భుత ప్రదర్శనను కొనసాగించాడు. కేరళతో జరిగిన ఫైనల్ నాలుగో రోజున, నాయర్ అజేయంగా 132 పరుగులు చేశాడు. ఇది టోర్నమెంట్‌లో అతని నాలుగో సెంచరీ. అతను మొత్తం రంజీ సీజన్‌లో 57.33 సగటుతో 860 పరుగులు చేశాడు. అంటే దేశవాళీ మొత్తం సీజన్‌లో నాయర్ తొమ్మిది సెంచరీలు చేశాడు.
రంజీ ట్రోఫీలో చివరి సెంచరీ తర్వాత జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడంపై చేసిన సెలబ్రేషన్స్‌పై చిరాకుగా ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. దీనిపై నాయర్ మాట్లాడుతూ.. అలా అస్సలు లేదు. నా సహచరులు ఎప్పుడూ నా నుంచి మరిన్ని సెంచరీలు ఆశిస్తున్నందున అలా జరిగింది. ఈ సీజన్‌లో నేను మరిన్ని సెంచరీలు సాధించగలనని అనుకుంటున్నాను అని అన్నాడు.
నాయర్ మాట్లాడుతూ.. నేను చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాను. ఎత్తుపల్లాలు చూశాను. పతనం నుండి మీరు ఎలా కోలుకుంటారు.. విజయాన్ని ఎలా మెనేజ్ చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా స్పందించాలో నేర్చుకున్నాను. కష్ట సమయాలు నన్ను ఈ స్థితికి తీసుకువచ్చాయి. భవిష్యత్తులో కూడా నాకు స్ఫూర్తిని ఇస్తాయని పేర్కొన్నాడు.
జట్టు కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ గురించి నాయర్ మాట్లాడుతూ.. అక్షర్ చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాడని.. అతని నాయకత్వ సామర్థ్యాలు అద్భుతమైనవని చెప్పాడు. అతను ఆటలోని ప్రతి అంశాన్ని బాగా అర్థం చేసుకుంటాడు. నేను అతడితో ఆడటానికి.. అతని నుండి నేర్చుకునేందుకు సంతోషిస్తున్నాను. అయితే, ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందా లేదా అనేది కచ్చితంగా చెప్పలేను అని పేర్కొన్నాడు.
కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ మధ్య కెప్టెన్సీ విషయంలో ఎలాంటి వివాదాలు వస్తాయని నేను అనుకోవడం లేదని నాయర్ చెప్పాడు. ఇద్దరు ఆటగాళ్లు సీనియర్ భారత జట్టులో భాగంగా ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన జట్టులో ఇద్దరూ ఉన్నారని పేర్కొన్నాడు.